కిడ్నీ సమస్యలు..క్రియాటినిన్ లెవల్స్ పెరుగుతున్నాయా!

Spread the love

క్రియాటినైన్ ఎక్కువగా ఉంటోందా..?

ఇవి చాలా ముఖ్యం. వయసు, లింగ బేధం, శరీర నిర్మాణం వంటి వాటిని బట్టి క్రియాటినైన్ మోతాదు మారుతూ ఉంటుంది. ఇది 1.4 ఎంజీ/డీఎల్ లోపుండాలి. అంతకుమించితే కిడ్నీ వ్యాధి ఉందనే అనుమానించాలి. క్రియాటినైన్ ఆధారంగా జీఎఫ్ ఆర్ ను అంచనా వేసి, వడపోత ప్రక్రియ ఎలా ఉందో చూస్తారు. కిడ్నీ జబ్బు నిర్ధారణకు ఇది చాలా ముఖ్యం. కిడ్నీ జబ్బు తగ్గటానికి మందులు వేసుకోవటం తప్పనిసరి. ఆహారంలో మార్పులతో క్రియాటినైన్ తగ్గుతుందని చెప్పలేం. కానీ ఎక్కువ కాకుండా చూసుకునే అవకాశముంది. కిడ్నీ జబ్బు గలవారికి మాంసాహారంలోని ప్రొటీన్లు ప్రమాదకరంగా పరిణమిస్తాయి. కాబట్టి మాంసాహారం తినకపోవటం మంచిది. అంతగా తినాలనుకుంటే సముద్రపు చేపలు తీసుకోవచ్చు. కూరగాయలు ఎక్కువగా తినాలి. చక్కెర, బెల్లం, మిఠాయిల వంటి తీపి పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. సంక్లిష్ట పిండి పదార్థాలు గల గోధుమల వంటి తృణధాన్యాలు ఎక్కువగా తినాలి. పొటాషియం అధికంగా ఉండే పండ్లు, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు మితంగానే తీసుకోవాలి. వక్కపొడి వాడుతున్నట్టయితే మానెయ్యాలి. మనదగ్గర నిల్వ పచ్చళ్లు తినే అలవాటు ఎక్కువ. వీటిల్లో ఉప్పు అధికంగా ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఒంట్లో నీటితో పాటు రక్తం మోతాదూ పెరుగుతుంది. ఫలితంగా కిడ్నీల మీద భారం పెరుగుతుంది. క్రియాటినైన్ ఎక్కువగా ఉండేవారికిది మరింత చేటు చేస్తుంది. అందువల్ల రోజు మొత్తమ్మీద ఉప్పు వాడకం 3-4 గ్రాముల కన్నా మించకుండా చూసుకోవాలి. వారానికోసారి పరీక్ష చేయించుకొని, మూత్రం ఎంత వస్తుందన్న దాన్ని బట్టి నీళ్లు తాగాలి. మూత్రం తక్కువగా వస్తుంటే ఆ మేరకే నీళ్లు తాగాలి. ఒకవేళ పాదాలు లేదా శరీరం ఉబ్బుతున్నట్టు అనిపిస్తే రోజుకు లీటరు కన్నా ఎక్కువ నీళ్లు తాగకూడదు. వెన్న తీసిన పాలు, పెరుగు తీసుకోవచ్చు గానీ మరీ ఎక్కువగా వద్దు. కాఫీ, టీలనూ పరిమితంగానే తాగాలి. చింతపండులో ఆగ్జలైట్లు ఎక్కువగా ఉంటాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే ఇవి శరీరంలో పేరుకుపోవచ్చు. అందువల్ల పులుపు కోసం చింతపండు బదులు నిమ్మరసం వాడుకోవచ్చు. అదీ మితంగానే. పొగతాగే అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. పొగలోని విషతుల్యాలు మూత్రపిండాలను నేరుగా దెబ్బతీస్తాయి. మద్యం అలవాటున్నా మానెయ్యాలి. కూల్ డ్రింకుల జోలికి అసలే వెళ్లరాదు. ఆహార జాగ్రత్తలతో పాటు రోజూ వ్యాయామం చేయటమూ ముఖ్యమే. రోజుకు కనీసం 8 వేల అడుగులైనా నడవాలి.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *