అమీన్ పూర్ ఘటన…అసలేం జరిగింది?

Spread the love

లైంగికదాడికి గురైన అనాథ బాలిక కన్నుమూత

దాత అకృత్యానికి బలి…

అరెస్టులు, వైద్యం అన్నీ ఆలస్యమే…

సాయం ముసుగులో ఓ మేకవన్నె పులి అభం శుభం తెలియని చిన్నారిని చిదిమేసింది…
నిర్వాహకుల సహకారంతో ఓ దాత చేసిన దాష్టీకానికి బాలిక కడతేరిపోయింది. ఆయన వచ్చినప్పుడు తనను గదిలోకి ఎందుకు పంపుతున్నారో తెలియని వయసు. మత్తు పానీయం ఇచ్చి కర్కశంగా ప్రవర్తిస్తున్నా…
ఏమీ చేయలేని నిస్సహాయత. వెరసి ఓ పసిమొగ్గ జీవితం 14 ఏళ్లకే ముగిసిపోయింది. ‘అమ్మ…
నాన్న లేరు కదా…అందుకే నాపై దాడి చేశారు…వాళ్లను జైల్లో పెట్టేందుకు న్యాయవాదిని అవుతా…ఇలాంటి వారి భరతం పడతా…అన్న ఆ చిన్నారి బాస గాలిలో కలిసిపోయింది… అనాథ శరణాలయంలో లైంగిక దాడికి గురైన
బాలిక నిలోఫర్‌ ఆసుపత్రిలో బుధవారం మృతి చెందింది…

ఏం_జరిగింది…?

అమీన్‌పూర్‌లోని ఓ ప్రైవేటు అనాథ శరణాలయంలో అయిదో తరగతి చదువుతున్న బాలిక వేసవి సెలవులు, లాక్‌డౌన్‌ కారణంగా న్యూ బోయిన్‌పల్లిలో ఉండే తన చిన్నమ్మ ఇంటికి వెళ్లింది. అనారోగ్యంగా ఉండటంతో బాలికను వైద్యులకు చూపించారు. ఆమె లైంగిక దాడికి గురైందని తెలుసుకుని ఫిర్యాదు చేయడంతో బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆశ్రమానికి విరాళాలు అందజేసే వేణుగోపాల్‌రెడ్డి అత్యాచారం చేశాడని, ఇందుకు నిర్వాహకులు సహకరించారని బాలిక తెలిపింది. కేసును అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయగా, వేణుగోపాల్‌రెడ్డితో పాటు శరణాలయ నిర్వాహకులు విజయ, జయదీప్‌లను అరెస్టు చేశారు. శరణాలయంలోని అయిదో అంతస్తుకు దాత వచ్చినప్పుడు నిర్వాహకులు బాలికను ఆ గదిలోకి పంపించేవారని, పానీయం తాగడంతో స్పృహ ఉండేది కాదని ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. మెలకువ వచ్చాక చూస్తే శరీరంపై దుస్తులు ఉండేవి కావని, ఎవరికీ చెప్పవద్దంటూ వార్డెన్‌ బెదిరించేదని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు భరోసా కేంద్రంలో బాలల సంరక్షణ కమిటీ (సీడబ్ల్యూసీ) సమక్షంలో పోలీసులు బాలిక వాంగ్మూలం నమోదు చేశారు.

అడుగడుగునా నిర్లక్ష్యం…

పోక్సో చట్టం కింద కేసు నమోదైన 24 గంటల్లోపు నిందితులను అరెస్టు చేయాల్సి ఉంది. జులై 31న ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే, విచారణ ముగిసే వరకు అరెస్టు చేయలేదు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి, మానసిక నిపుణులతో వైద్యం అందించడంలోనూ జాప్యం జరిగింది. సంరక్షణాలయంలో చేర్పించే సమయానికే బాలిక పరిస్థితి విషమించడంతో నిలోఫర్‌కు పంపించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.విచారణ సమయంలో బాగానే ఉన్న బాలిక తరువాత తీవ్రమైన అనారోగ్యానికి గురికావడంపై బాలల సంరక్షణ కమిటీ (సీడబ్ల్యూసీ) సందేహాలు వ్యక్తం చేసింది. ఆమె మృతిలో డ్రగ్స్‌ ప్రభావం ఏమైనా ఉందా అని నిలోఫర్‌ ఆసుపత్రి వర్గాలను నివేదిక కోరింది. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు న్యూ బోయిన్‌పల్లిలో ఆందోళన చేశారు….


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *