రెవెన్యూ పదజాలం| కొన్ని కొత్తగా….!?

Spread the love

మ‌న‌లో ఇప్ప‌టికీ అనేక మందికి రెవెన్యూ ప‌ద‌జాలం అర్థం కాదు. అందులో ఏవేవో ప‌దాల‌ను ఉప‌యోగిస్తుంటారు. కొన్ని అర్థ‌మ‌వుతాయి. కొన్ని కాల‌క్ర‌మేణా తెలుస్తుంటాయి. కానీ కొన్ని ప‌దాలు మాత్రం ఇప్ప‌టికీ అనేక మందికి తెలియ‌వు. రెవెన్యూ విభాగంలో ఇంగ్లిష్‌, తెలుగు ప‌దాల‌ను వాడుతున్న‌ప్ప‌టికీ నిజాం కాలం నాటి నుంచి ఉన్న కొన్ని ఉర్దూ ప‌దాల‌ను ఇప్ప‌టికీ ఉప‌యోగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అలాంటి ప‌దాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రామ‌కంఠం – గ్రామం మొత్తానికి చెందిన ఉమ్మ‌డి స్థ‌లాన్నేగ్రామ కంఠం అంటారు. దీంట్లో స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తారు. గ్రామ కంఠానికి చెందిన భూముల వివ‌రాలు ఆ గ్రామ పంచాయ‌తీ రికార్డుల్లో ఉంటాయి.

అసైన్డ్ భూమి – భూమి లేని పేద‌ల‌కు ప్ర‌భుత్వం పంట‌ల‌ను సాగు చేసుకునేందుకు, ఇళ్లు క‌ట్టుకునేందుకు భూముల‌ను ఇస్తుంది. ఆ భూమిని అసైన్డ్ భూమి అంటారు. ఇది వార‌స‌త్వ సంప‌ద‌గా వ‌స్తుంది. కానీ దీన్ని అమ్మ‌డం, ఇత‌రుల‌కు బ‌ద‌లాయించ‌డం చేయ‌రాదు.

ఆయ‌క‌ట్టు – ఏదైనా ఒక నీటి వ‌న‌రు కింద సాగు అయ్యే మొత్తం భూమిని ఆయ‌క‌ట్టు అంటారు.

బంజ‌రు భూమి – రెవెన్యూ రికార్డుల్లో ప్ర‌త్యేక గుర్తుల‌తో ఈ భూమిని సూచిస్తారు. గ్రామం లేదా మండ‌ల ప‌రిధిలో ఖాళీగా ఉండి ప్ర‌జావ‌స‌రాల కోసం ఈ భూమిని కేటాయిస్తారు.

అగ్ర‌హారం – ఒక‌ప్పుడు బ్రాహ్మ‌ణుల‌కు శిస్తు లేకుండా లేదా త‌క్కువ శిస్తుతో ఇనాంగా గ్రామాల‌ను ఇచ్చేవారు. ఆ గ్రామాన్ని లేదా అందులోని కొంత వర‌కు భాగాన్ని అగ్ర‌హారం అని పిలుస్తారు.

దేవళ్ ఇనాం – దేవాల‌యాలను నిర్వ‌హించేందుకు దేవాల‌యం పేరిట లేదా పూజారి పేరిట కేటాయించ‌బ‌డిన భూమి

అడంగ‌ల్ (ప‌హాణీ) – ఏదైనా గ్రామంలో ఉండే సాగు భూముల వివ‌రాల‌ను న‌మోదు చేసే రిజిస్ట‌ర్‌ను అడంగ‌ల్ అంటారు. దీన్నే తెలంగాణ‌లో ప‌హాణీ అంటారు. భూమికి చెందిన చ‌రిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. భూముల కొనుగోలు, అమ్మ‌కాలు, సాగు చేస్తున్న పంట త‌దిత‌ర వివ‌రాలు ఇందులో ఉంటాయి.

త‌రి – సాగు భూమి

ఖుష్కీ – మెట్ట ప్రాంతం

గెట్టు – పొలం హ‌ద్దు

కౌల్దార్ – భూమిని కౌలుకు తీసుకునేవాడు

క‌మ‌తం – భూమి విస్తీర్ణం

ఇలాకా – ప్రాంతం

ఇనాం – ప్ర‌భుత్వ ఇచ్చే భూమి

బాలోతా ఇనాం – భూమిలేని నిరుపేద ద‌ళితుల‌కు ప్ర‌భుత్వం ఇచ్చే భూమి

స‌ర్ఫేఖాస్ – నిజాం న‌వాబు సొంత భూమి

సీలింగ్ – భూ గ‌రిష్ట ప‌రిమితి

స‌ర్వే నంబ‌ర్ – భూముల గుర్తింపు కోసం కేటాయించేది

న‌క్షా – భూముల వివ‌రాలు తెలిపే చిత్ర‌ప‌టం

క‌బ్జాదార్ – భూమిని ఆక్ర‌మించి త‌న ఆధీనంలో ఉంచుకుని అనుభ‌వించే వ్య‌క్తి

ఎన్‌కంబ‌రెన్స్ స‌ర్టిఫికెట్ (ఈసీ) – భూ స్వ‌రూపాన్ని తెలియ‌జేసే ధ్రువీక‌ర‌ణ ప‌త్రం. 32 ఏళ్ల లోపు ఓ స‌ర్వే నంబ‌ర్ భూమికి జ‌రిగిన లావాదేవీల‌ను తెలియ‌జేసే ప‌త్రాల‌ను ఈసీ అంటారు.

ఫీల్డ్ మెజ‌ర్‌మెంట్ (ఎఫ్ఎంబీ) బుక్ – దీన్ని ఎఫ్ఎంబీ టీప‌న్ అని కూడా పిలుస్తారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఇది ఒక భాగంగా ఉంటుంది. దీంట్లో గ్రామంలోని అన్ని స‌ర్వే నంబ‌ర్లు, ప‌ట్టాలు, కొల‌త‌లు ఉంటాయి.

బందోబ‌స్తు – వ్య‌వ‌సాయ భూముల‌ను స‌ర్వే చేసి వ‌ర్గీక‌ర‌ణ చేయ‌డమే బందోబస్తు.

బీ మెమో – ప్ర‌భుత్వ భూమిని ఆక్ర‌మించి సాగు చేసుకుంటున్న వ్య‌క్తి, శిస్తు, జ‌రిమానా చెల్లించాల‌ని ఆదేశించే నోటీస్‌ను బీ మెమో అని వ్య‌వ‌హ‌రిస్తారు.

పోరంబోకు – భూముల‌పై సర్వే చేసే నాటికి సేద్యానికి ప‌నికిరాకుండా ఉన్న భూములు. ఇవి ప్ర‌భుత్వానికి చెందుతాయి.

ఫైస‌ల్ ప‌ట్టీ – బ‌దిలీ రిజిస్ట‌ర్

చౌఫ‌స్లా – ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు స‌ర్వే నంబ‌ర్ల భూముల ప‌న్ను ముదింపు రికార్డు.

డైగ్లాట్ – తెలుగు, ఇంగ్లిష్ భాష‌ల్లో ముద్రించిన శాశ్వ‌త ఎ-రిజిస్ట‌ర్

విరాస‌త్ లేదా ఫౌతి – భూ య‌జ‌మాని చ‌నిపోయిన త‌రువాత అత‌ని వార‌సుల‌కు భూమిపై హక్కులు క‌ల్పించ‌డాన్నే విరాస‌త్ లేదా ఫౌతి అంటారు.

కాస్తు – సాగు చేయ‌డం.

మింజుములే – మొత్తం భూమి.

మార్ట్‌గేజ్ – రుణం కోసం భూమిని కుదువ పెట్ట‌డం.

మోకా – క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న (స్పాట్ ఇన్‌స్పెక్ష‌న్‌)

ప‌ట్టాదారు పాస్ పుస్త‌కం – రైతుకు ఉన్న భూమి హ‌క్కుల‌ను తెలియ‌జేసే పుస్త‌కం.

టైటిల్ డీడ్ – భూ హ‌క్కు ద‌స్తావేజు, దీనిపై ఆర్‌డీవో సంత‌కం ఉంటుంది.

ఆర్‌వోఆర్ (రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ) – భూమి యాజ‌మాన్య హ‌క్కుల రిజిస్ట‌ర్.‌

ఆర్ఎస్సార్ – రీ సెటిల్‌మెంట్ రిజిస్ట‌ర్ లేదా శాశ్వ‌త ఎ రిజిస్ట‌ర్.

ప‌ర్మినెంట్ రిజిస్ట‌ర్ – స‌ర్వే నంబ‌ర్ల వారీగా భూమి శిస్తుల‌ను నిర్ణ‌యించే రిజిస్ట‌ర్‌. సేత్వార్ స్థానంలో దీన్ని ప్ర‌వేశ‌పెట్టారు.

సేత్వార్ – రెవెన్యూ గ్రామాల వారిగా మొద‌టి సారి చేసిన భూమి స‌ర్వే వివ‌రాలు, ప‌ట్టాదారుల వివ‌రాలు తెలిపే రిజిస్ట‌ర్. ఇది 1953 వ‌ర‌కు అమ‌లులో ఉండేది. అనంతరం ఖాస్రా ప‌హాణీని ప్ర‌వేశ‌పెట్టారు.

సాదాబైనామా – భూ క్ర‌య విక్ర‌యాల‌కు సంబంధించి తెల్ల కాగితంపై రాసుకునే ఒప్పంద ప‌త్రం.

ద‌స్తావేజు – భూముల కొనుగోళ్లు, అమ్మ‌కాలు, కౌలుకు ఇవ్వ‌డం లాంటి ఇత‌ర‌త్రా లావాదేవీల‌ను తెలియ‌జేసే ప‌త్రం.

ఎక‌రం – భూమి విస్తీర్ణాన్ని కొలిచే కొల‌మానం. 4,840 చ‌ద‌ర‌పు గ‌జాల స్థ‌లం లేదా 100 సెంట్లు లేదా 40 గుంట‌లను ఎక‌రంగా వ్య‌వ‌హ‌రిస్తారు. 1

సెంటు అంటే 48.4 గ‌జాలు. 1 గుంట‌కు 121 గజాలు. ఆంధ్రాలో సెంటు అని తెలంగాణ‌లో గుంట అని వ్య‌వ‌హ‌రిస్తారు.

అబి – వానాకాలం పంట

ఆబాది – గ్రామ కంఠంలోని గృహాలు లేదా నివాస స్థ‌లాలు

అసైన్‌మెంట్ – ప్ర‌త్యేకంగా కేటాయించ‌బ‌డిన భూమి

శిఖం – చెరువు నీరు నిల్వ ఉండే ప్రాంతం

బేవార్స్ – హ‌క్కుదారు ఎవ‌రో తెలియ‌ని భూమిని భేవార్స్ భూమి అంటారు.

దో ఫ‌స‌ల్ – రెండు పంటు పండే భూమి

ఫ‌స‌లీ – జూలై 1 నుంచి 12 నెల‌ల కాలాన్ని ఫ‌స‌లీగా వ్య‌వ‌హ‌రిస్తారు.

నాలా – వ్య‌వ‌సాయేత‌ర భూమి

ఇస్తిఫా భూమి – ప‌ట్టాదారు స్వ‌చ్ఛందంగా ప్ర‌భుత్వ ప‌రం చేసిన భూమి

ఇనాం ద‌స్త‌ర్‌దాన్ – పొగ‌డ్త‌ల‌కు మెచ్చి ఇచ్చే భూమి

ఖాస్రాప‌హాణీ – ఉమ్మ‌డి కుటుంబంలో ఒక వ్య‌క్తి పేరు మీద ఉన్న భూ రికార్డుల‌ను మార్పు చేస్తూ భూమి ప‌ట్టా క‌ల్పించిన ప‌హాణీ.

గైరాన్ – సామాజిక పోరంబోకు

యేక్‌రార్‌నామా – ఇరు గ్రామాల పెద్దల నుంచి స‌ర్వేయ‌ర్ తీసుకునే గ్రామాల ఒప్పందం


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *