7వ తరగతి బాబు కష్టాలు | ముందే పేదరికం ఆపై కరోనా కాలం…ఎంత మంది బతుకులు చిద్రమైతున్నాయో!

Spread the love

తమ్ముడూ రాహుల్.. నువ్వు ఉన్నత స్థాయికి ఎదగాలి

మూడు నాలుగు రోజులుగా మా కాలనీలో ఒక చిన్నోడు గట్టి గట్టిగా అరుస్తూ కూరగాయలు అమ్ముతున్నాడు. త్వరగా అమ్ముకొని వెళ్లాలనే తాపత్రయం అతడిలో కనిపించింది. ఒకసారి మాట్లాడదామని… అతడిని ఆగమన్నా. అన్నా.. ఏం కావాలి అని అంటుండగానే.. టమాటా వున్నాయా అని అడిగా… ఇదుగో అన్నా కిలో టమాటాలు అంటూ… ఒక కవర్ చేతికిచ్చాడు. సమయం వృధా కావొద్దనే ఉద్దేశంతో ముందుగానే తన ఉన్న కూరగాయలు కిలో, అర కిలో లాగా జోకి కవర్ లలో పెట్టుకొని వచ్చాడు. భలే ఆలోచన తమ్ముడు… ఇంతకీ చదువుతున్నవా? లేదా? అని అడిగా.

“అన్నా మాది ఖేడ్ దగ్గర ఒక చిన్న తండా. అక్కడ పని లేక అక్కని, చెల్లిని, నన్ను తీసుకొని మా అమ్మానాన్న సంగారెడ్డి వచ్చారు. మా నాన్న ఒక కంపెనీలో వంట మనిషిగా చేస్తుండే. అమ్మ రోడ్డు మీద చిన్న బండి పెట్టి జొన్న రొట్టెలు అమ్మేది. కరోనా వల్ల ఆ రెండు పనులూ పోయాయి. కుటుంబం గడవడం కష్టంగా మారింది. అందుకే నాన్న,అమ్మ మార్కెట్ లో కూరగాయలు తెచ్చి అమ్ముతున్నారు. ఇప్పుడు బడి కూడా లేదు. అందుకే నేనూ కొన్ని కూరగాయలు తీసుకొని ఇలా సైకిల్ మీద తిరుగుతూ అమ్ముతున్న. అమ్మా నాన్నకి కొంత ఇబ్బంది తగ్గుతుంది కదా” అంటూ రాహుల్ చెప్పుకొచ్చాడు

మరి అంత జల్దీ జల్దీ పోతున్నావ్ అని అడగ్గా… “తొందరగా అమ్మి ఇంటికి పోయి ఆన్లైన్ క్లాసులు వినాలి. రోజూ కొంత సేపు చదువుకోవాలి”అంటూ సదాశివ పేట గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నా అంటూ వివరించాడు. ఆ కుర్రాడిని చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది.

ప్రస్తుతం అతడి కుటుంబం ఇబ్బందుల్లో వుండొచ్చు. డబ్బుకు సమస్య కావొచ్చు. కానీ రాహుల్ లో నాకు గొప్ప ఆత్మవిశ్వాసం కనిపించింది. ఎన్ని బాధలున్నా దైర్యంగా ముందుకెళ్లాలి అన్నా.. అని చెబుతున్నట్లు అతడి కళ్ళలో గొప్ప ఉత్సాహం

తమ్ముడూ… రాహుల్. నువ్వు ఖచ్చితంగా గొప్ప స్థాయికి చేరుకుంటావ్. చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *